బొత్సా సత్యనారాయణ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిపై ఎక్కువగా మాట్లాడుతున్నావని, నీవు, నీ కుటుంబం ఈ స్థితిలో ఉన్నారంటే అందుకు వైయస్సార్ కారణమని, వైయస్ చలువతో గెలిచి జోడు పదవులు అనుభవిస్తున్న బొత్సా ఇప్పటికైనా నీ పద్ధతులు మానుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధనరెడ్డి బొత్సాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైయస్సార్ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి సర్వ మత పూజలు నిర్వహించి ఘనంగా వైయస్సార్‌కు నివాళులర్పించారు.
వైయస్ 2వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని జిల్లావ్యాప్తంగా ఈ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పేదవారికి పక్కా గృహాలు నిర్మించాలనే ఉద్ధేశ్యంతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు చేపడితే ఆయన మరణాంతరం ఒక్క గృహం కూడా పూర్తి చేయలేదని, మంజూరు అయిన గృహాలకు బిల్లులు చెల్లించలేదన్నారు. నిరుపేదల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అటకెక్కి 104, 108 సర్వీసులు ప్రజలకు దూరమయ్యాయన్నారు. రేషను కార్డులు క్రొత్తవి మంజూరు చేయకపోగా, బోగస్ కార్డుల పేరుతో ఉన్నవి తొలగించారని ఆయన ఆవేదన చెందారు. వృద్ధులకు నిర్ధేశించిన పింఛన్లు సరిగా అందడం లేదన్నారు.
జగన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వైయస్ వలన ఎవరైతే పదవులు పొందారో వారే గతాన్ని మరచి వైయస్ గురించి దిగజారి మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. టిడిపి, కాంగ్రెస్‌లు కుమ్మకై్క వైయస్ కుటుంబంపై బురదజల్లుతున్నారన్నారు. సిబిఐ విచారణ అప్పటి మంత్రులపై చేయాల్సింది పోయి జగన్‌పై విచారణ చేయడం ఎంత వరకు సబబన్నారు. రాజీనామాలు ఆమోదించాల్సింది వారే, అధికారం, ప్రభుత్వం వారిదే అయినప్పుడు హద్దు మీరి మాట్లాడం ఎందుకు అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మస్తాన్‌బాబు, విజయకుమార్‌రెడ్డి, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.