Pages

Monday, June 13, 2011

తప్పులు నిరూపిస్తే ఆత్మార్పన చేసుకుంటా

జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమ 5 సంవత్సరాల జిల్లా పరిషత్‌ పరిపాలనలో తప్పు నిరూపిస్తే ఆత్మార్పణ చేసుకుంటానని జెడ్‌పి చైర్మన్‌ కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్‌ సాధారణ సమావేశ భవనాన్ని రెండు లక్షల రూపాయల నిధులతో నూతనంగా మరమ్మతులు చేపట్టడం జరిగింది. దీని ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిపాలనలో పార్టీలకు అతీతంగా నిధులు మంజూరు చేసి అభివృద్దికి కృషి చేసానన్నారు.

జిల్లాలో అధికార పార్టీ మంత్రులు, నాయకులు ఎన్నో దఫాలుగా కాంగ్రెస్‌ పార్టీ వారికి రెండు భాగాలు, తెలుగు దేశం పార్టీ వారికి 1 భాగం నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేసినా తాను పట్టించుకోకుండా అలా వీలు లేదని తేల్చి చెప్పడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్‌ నూతన భవన సముదాయం నిర్మించడం నేను తప్పు చేసినట్లా, దానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా పరిషత్‌లో, మండల ప్రజా పరిషత్‌లో ఏసీబీ దాడులు నిర్వహించి బయపెట్టడానికి ప్రయత్నించినా దేనికి బయపడకుండా పని చేశానన్నారు. దీనికి కూడా తమ 5 సంవత్సరాలలో ఏసీబీ యే కాదు సీబీఐతో నైనా దాడులు నిర్వహించి తమ తప్పు నిరూపిస్తే జీవిత కాలం రుణపడి ఉంటానని ముఖ్య మంత్రికి కూడా లేఖ రాశానన్నారు.

అధికార పార్టీ నాయకులు అభివృద్ది పనులను అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు. జిల్లాలో 54 గ్రామాలలో మంచి నీటి కొరత ఉంటె 51 గ్రామాలకు త్రాగు నీటి కొరత తీర్చడం జరిగిందన్నారు. విద్యకు పెద్దపీఠం వేయాలనే ఉద్దేశంతో విజయదీపికలు విద్యార్థులకు రకరకాల ప్రోత్సాహక బహుమతులు కూడా అందించడం జరిగిందన్నారు. అధే విధంగా వైద్యం కూడా అందజేశామన్నారు. ప్రజలు కూడా పనులు చేసే నాయకులను ఎన్నుకోవాలని, గ్రామీణ అభివృద్ది అప్పుడే అవుతుందన్నారు. అనంతరం కాకాణిను ఎంపిపి మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, మాజి ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పాశం సునీల్‌కుమార్‌, జెడ్‌పిటీసి మేకల రాజేశ్వరమ్మలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్‌ నెలబల్లి భాస్కర్‌రెడ్డి, విడవలూరు, మనుబోలు జెడ్‌పిటీసీలు వీరి చలపతి, భాస్కర్‌ గౌడ్‌లు, కాంగ్రెస్‌ నాయకులు మల్లికార్జున్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sunday, June 12, 2011

రైతన్నలూ.. కదలిరండి --- Kaakani

రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈనెల 13న తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతాంగం కదలి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం ఆయన నెల్లూరు నగరంలోని తన నివాసంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి గుంటూరులో దీక్ష చేసి, సమస్యలను విన్నవించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం శోచనీయమన్నారు. మొండిగా వ్యవహరిస్తున ప్రభుత్వాన్ని నిలదీయడానికి 13న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ముట్టడికి తమ పార్టీ అధినేత పిలుపు నిచ్చారన్నారు.

జిల్లాలో రైతులు, రైతులను అభిమానించే వారు నెల్లూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కదలి రావాలని కోరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఏ కష్టమొచ్చినా.. ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసా ఉండేదన్నారు. 2009లో తిరిగి వైఎస్సార్ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులు ఎంతో సంతోషించారన్నారు. దురదృష్టవశాత్తు ఆ మహానేత మనకు దూరమయ్యారని, ఆయన మరణానంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి తన పదవిని నిలబెట్టుకోవడానికి, అవిశ్వాసం నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్-ఢిల్లీ మధ్య తిరుగుతూ ఉండడం ిసిగ్గ్గుచేటన్నారు. అన్నదాతలే అకలి కేకలు వేసే పరిస్థితులు దాపురించాయన్నారు. వైఎస్సార్ ఆశయాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటాలు చేస్తున్నారని, ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకొని ప్రభుత్వం మెడలు వంచాలని కాకాణి పిలుపునిచ్చారు.

Thursday, June 9, 2011

చరిత్ర హీనులు ఆనం సోదరులు కాకాణి, మేకపాటి ధ్వజం

మంత్రులుగా ప్రజాప్రతినిథులుగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాల్సిన ఆనం సోదరులు అందుకు భిన్నంగా వ్యవహరించి ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధనరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా ప్రగతి నిరోధకులుగా మారిన ఆనం సోదరులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. గురువారం మేకపాటి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ కాకాణి మాట్లాడుతూ ఆర్ధిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు. అధికారులను భయపెట్టి వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మద్దతుదారులు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా అడ్డుకుంటున్నారన్నారు. జగన్ వర్గానికి చెందిన ప్రజాప్రతినిథులను లక్ష్యం పెట్టొద్దని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఆనం సోదరులిద్దరూ ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను, మొదలయిన పనులకు నిధుల విడుదలను అడ్డుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు సహనంతో వ్యవహరించామని ఇక ముందు కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తే అధికారులను కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని ఈ ధోరణులకు అడ్డుకట్ట వేయాలన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులు అధికారులు వ్యవహరిస్తున్న తీరును సమీక్షించాలన్నారు. ప్రజాప్రతినిథుల రాజకీయ చదరంగంలో అధికారులు నలిగిపోకూడదనే భావనతో ఉన్నామని ఇక నుంచైనా నిస్పక్షపాతంగా వ్యవహరించి అభివృద్ధికి దోహదపడాలని కోరారు.

Wednesday, June 8, 2011

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే వాటిని ఎదుర్కొని తమ సత్తా చాటేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని హోటల్‌ సన్నీహైట్స్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తామంతా కలసికట్టుగా పనిచేసి పార్టీని నిర్మాణాత్మకంగా, పటిష్టపరచేందుకు కృషి చేస్తామన్నారు. మరో 10 రోజుల్లోపు నియోజకవర్గ, జిల్లా, మండల కమిటీల ఏర్పాటు జరుగుతుందన్నారు. ముందుగా జిల్లా వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని, అయితే ఆ కార్యక్రమం ఇతర పార్టీల మాదిరిగా తూతూ మంత్రంగా, ఒక ప్రహసనంగా మాత్రం ఉండబోదన్నారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ముఖ్యంగా సభ్యత్వ నమోదు విషయమై కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి వారి కోరిక మేరకు మాత్రమే సభ్యత్వ నమోదు చేసుకోవాలే తప్ప బలవంతంగా చేయవద్దన్నారు.

Monday, June 6, 2011

రాష్టమ్రంతటా... అదే తీర్పు దొరవారిసత్రం సభలో మేకపాటి, కాకాణి

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, కడప ఉప ఎన్నికల ఫలితాల మాదిరే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని నె ల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం సూళ్లూరుపేట నియోజక వర్గంలోని దొరవారి సత్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో వారు ప్రసంగించారు.ఎంపీ మేకపాటి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగిన శక్తి సామర్థ్యాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణలోనూ ఆయన ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. ప్రజాభిమానాలు కలిగిన నేతను నిలువరించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలను అడ్డుకుంటున్న అధికార పార్టీకి పుట్టగతులుండవన్నారు. ఏ ముఖ్యమంత్రులు, నాయకులు ప్రవేశపెట్టని అభివృద్ధి పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారన్నారు. ఆ పథకాలను ప్రజలకు చేరువ కాకుండా చూసేందుకు అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారన్నారని విమర్శించారు. అభివృద్ధి పథకాలను ప్రజలకందిస్తున్న అధికారులపై ఏసీబీ దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. 2004 ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్సార్ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో రాష్ట్రం సుభిక్షంగా మా రిందన్నారు. ఈ అభిమానంతోనే 2009 ఎన్నికల్లో రెండోసారి వైఎస్సార్‌కు సీఎం పట్టం కట్టారన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ

ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రజలకు చేయలేని సంక్షేమ పథకాలను ఆయన అందించారన్నారు. ఆయన మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడంతో విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, మూడో విడతలో వృద్ధులకు పింఛన్ల పంపిణీ నిలిచి పోయిందన్నారు. పక్కా ఇల్లు నిర్మాణాలు ఆగిపోయాయని సంక్షేమ పథకాలు, పావలా వడ్డీ రుణాలు డ్వాక్రా గ్రూపులకు ఇవ్వ లేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆగిపోవడంతో ఏ ముఖ్యమంత్రి వస్తే న్యాయం చేస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వైఎస్సార్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు ఓదార్పుల్లో ప్రజాదరణ చూపి నిరూపించారన్నారు.

అవిశ్వాస తీర్మానం పేరుతో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై నాటకాలాడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీ నం చేసుకోవడమే కాదు...తెలుగుదేశం పార్టీను కూడా కాంగ్రెస్‌లో కలుపుకుని ఎన్నికలకు వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో చూపుతామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు, ఎమ్మెల్యేలు, నాయకులు నీతి నిజాయితీకు మారుపేరన్నారు.

సంక్షేమ పథకాలతో ఆశీర్వదిస్తున్నారు : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
టీడీపీ పార్టీకు ఓటు బ్యాంకుగా ఉన్న గిరిజన తండాలు వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదిస్తున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని సంక్షేమ పథకాలతో తమ జీవనస్థితిగతులు మెరుగుపడాలని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. నక్సలిజం ఉన్న ప్రాంతంలో కూడా జగన్‌మోహన్‌రెడ్డి అభిమానం చూరగొంటున్నారన్నారు.

ప్రభంజనం సృష్టిస్తారు : పద్మనాభ రెడ్డి
జగన్‌మోహన్‌రెడ్డి రాబోయే రోజుల్లో రాజకీయ ప్రభంజనం సృష్టించనున్నారన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ప్రజలను మోసం చేస్తూ మభ్య పెడుతున్నారన్నారు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనంతో ఈ నేతలిద్దరు కొట్టుకుపోతార న్నారు.

రాష్ట్ర ప్రజలు విలవిలలాడుతున్నారు : చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై దొంగనాటకాలు వేసే బదులు, ఆ రెండు పార్టీలు ఒక్కటై పోరాడితే మంచిదని తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులు, వికలాంగులు, వృద్ధులు వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిలిచి పోవడంతో విలవిలలాడిపోతున్నారన్నారు. సీఎం,బాబు, చిరంజీవి ముగ్గురు చిత్తూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అయితే చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి విన్యాసాలను జిల్లా ప్రజలు తిప్పికొట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతను గెలిపించారన్నారు.

వైఎస్సార్ బొమ్మ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు: ఎల్లసిరి
ప్రజాభిమానం పొందిన సంక్షేమ పథకాలకు కారణమైన వైఎస్సార్ బొమ్మను తొలగించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీకి కడప ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి భవిష్యత్ నేత జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రత్యర్థి పార్టీలకు తెలిసిన సత్యమన్నారు. కడప ఫలితాలను మించిన తీర్పును ఇవ్వడానికి ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.

మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం. మాట్లాడుతూ.....పెద్దలు రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి సారథ్యంలో జిల్లాలో 40 జెడ్పీటీసీలు,40 ఎంపీపీల స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టుకు పోతుందని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాసం పేరుతో ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

దబ్బల రాజారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలలో కొంత మంది నాయకులే మిగులుతారని, ఆ పార్టీల కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు రాబోతున్నారన్నారు. వైఎస్సార్ పుణ్యాన లబ్ధి పొంది ఇవాళ నాటకాలాడుతున్న నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.