Pages

Monday, June 13, 2011

తప్పులు నిరూపిస్తే ఆత్మార్పన చేసుకుంటా

జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమ 5 సంవత్సరాల జిల్లా పరిషత్‌ పరిపాలనలో తప్పు నిరూపిస్తే ఆత్మార్పణ చేసుకుంటానని జెడ్‌పి చైర్మన్‌ కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్‌ సాధారణ సమావేశ భవనాన్ని రెండు లక్షల రూపాయల నిధులతో నూతనంగా మరమ్మతులు చేపట్టడం జరిగింది. దీని ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిపాలనలో పార్టీలకు అతీతంగా నిధులు మంజూరు చేసి అభివృద్దికి కృషి చేసానన్నారు.

జిల్లాలో అధికార పార్టీ మంత్రులు, నాయకులు ఎన్నో దఫాలుగా కాంగ్రెస్‌ పార్టీ వారికి రెండు భాగాలు, తెలుగు దేశం పార్టీ వారికి 1 భాగం నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేసినా తాను పట్టించుకోకుండా అలా వీలు లేదని తేల్చి చెప్పడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్‌ నూతన భవన సముదాయం నిర్మించడం నేను తప్పు చేసినట్లా, దానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా పరిషత్‌లో, మండల ప్రజా పరిషత్‌లో ఏసీబీ దాడులు నిర్వహించి బయపెట్టడానికి ప్రయత్నించినా దేనికి బయపడకుండా పని చేశానన్నారు. దీనికి కూడా తమ 5 సంవత్సరాలలో ఏసీబీ యే కాదు సీబీఐతో నైనా దాడులు నిర్వహించి తమ తప్పు నిరూపిస్తే జీవిత కాలం రుణపడి ఉంటానని ముఖ్య మంత్రికి కూడా లేఖ రాశానన్నారు.

అధికార పార్టీ నాయకులు అభివృద్ది పనులను అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు. జిల్లాలో 54 గ్రామాలలో మంచి నీటి కొరత ఉంటె 51 గ్రామాలకు త్రాగు నీటి కొరత తీర్చడం జరిగిందన్నారు. విద్యకు పెద్దపీఠం వేయాలనే ఉద్దేశంతో విజయదీపికలు విద్యార్థులకు రకరకాల ప్రోత్సాహక బహుమతులు కూడా అందించడం జరిగిందన్నారు. అధే విధంగా వైద్యం కూడా అందజేశామన్నారు. ప్రజలు కూడా పనులు చేసే నాయకులను ఎన్నుకోవాలని, గ్రామీణ అభివృద్ది అప్పుడే అవుతుందన్నారు. అనంతరం కాకాణిను ఎంపిపి మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, మాజి ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పాశం సునీల్‌కుమార్‌, జెడ్‌పిటీసి మేకల రాజేశ్వరమ్మలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్‌ నెలబల్లి భాస్కర్‌రెడ్డి, విడవలూరు, మనుబోలు జెడ్‌పిటీసీలు వీరి చలపతి, భాస్కర్‌ గౌడ్‌లు, కాంగ్రెస్‌ నాయకులు మల్లికార్జున్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment