Pages

Tuesday, January 3, 2012

వైఎస్ పథకాలకు మంగళం పాడి చరిత్ర హీనులు కావద్దు

కాంగ్రెస్ నేతలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్థన్ రెడ్డి హితవు



దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మంగళం పాడి చరిత్ర హీనులుగా మిగలవద్దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్థన్ రెడ్డి హితవు పలికారు. సోమవారం స్థానిక వైఎస్‌ఆర్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేసి, తద్వారా వైఎస్‌పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చెరిపేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే వైఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైఎస్ బతికున్నప్పుడు బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సుమారు 3200 కోట్ల రూపాయల నిధులను కేటాయించగా, ఈ ఏడాది విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన వాటిలో సుమారు 2200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్నారు. మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో చెల్లించాల్సిన బకాయిల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. దీని వలన అనేక మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఈ పరిణామాలతో రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థులు అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని చెవిటి ప్రభుత్వంగా తయారైందన్నారు. ఈ పరిస్థితుల్లో బాధ్యతగల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి జనవరి 4వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు

No comments:

Post a Comment