Pages

Wednesday, March 9, 2011

ఎమ్మెల్సీ ఓటర్లపై అధికార పార్టీ దౌర్జన్యాలు --- కాకాణి

త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఓటర్లపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జగన్‌ వర్గ నేతలు ఆరోపించారు.బుధవారం నగరంలోని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు అంతా ఇంతా కాదన్నారు. పేద దళితులను సైతం వారు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

జిల్లాలోని జడ్పీటిసిలు, ఎంపిటిసిలను అధికార పార్టీ నేతలు బలవంతంగా, దౌర్జన్యంగా క్యాంప్‌లకు తరలించి వారిని బంధించినప్పటికీ వారి శరీరాలు మాత్రమే అక్కడ ఉన్నప్పటికీ వారి మనసంతా దివంగత నేత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి బలపరచిన అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఉన్నారని చెప్పారు. తమ అభ్యర్థి 300 పైచిలుకు ఓట్లుతో గెలువబోతున్నారని, మిగిలిన ఓట్లను ఆ రెండు పార్టీలు పంచుకోవాల్సి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మధ్యే పోటీ ఉందని, ఆ మూడో వ్యక్తి ఎవరో తమకు తెలియదని అనడం మంచి పద్ధతి కాదని పరోక్షంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఉద్దేశించి అన్నారు.

ఎన్నికలు జరిగిన తర్వాత ఆ మూడో వ్యక్తి ఎవరో ఫలితాలు చెబుతాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు.ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో తమ పనైపోయిందని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని, అయితే తమకేమీ కాలేదన్నారు.కొందరు వ్యక్తులు తమను బెదిరిస్తున్నారని అయినా ఆ బెదిరింపులు తమనేమీ చేయవని కొట్టిపారేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన వ్యక్తులను కూడా వారు అనేకవిధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ తెలుగుదేశం పార్టీ వారికి పనులు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీవారు ఒకరినొకరు మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తుండడం చూస్తుంటే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినట్లు స్పష్టమవుతుందన్నారు.

గతంలో తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డామని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని, అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఎవరిని ఎవరు సస్పెండ్‌ చేయాలి? అని ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్న వారిపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని, అందుకు ధీటుగా సమాధానం చెబుతామని ఆయన హెచ్చరించారు. జగన్‌ వర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తానేదో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ ఓటర్లను కొనుగోలు చేస్తున్నట్లు ఒక పత్రికలో వ చ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.

తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చానని, ఎంతో కష్టపడి ఇంజనీరింగ్‌ పూర్తి చేసి వ్యాపారం చేసి డబ్బు సంపాదించానే తప్ప రాజకీయాల్లో సంపాదించలేదని వివరించారు. తాను ఇంజనీరింగ్‌ కళాశాలను స్థాపించి పేద విద్యార్థులకు సహాయపడుతున్నానన్నారు. ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా కూడా సమాజసేవకు ఉపయోగపడుతున్నానే తప్ప రాజకీయాల్లో సంపాదించి టాటా-బిర్లాను కావాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. దివంగత నేత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ఆయన పేదవాడి గుండెల్లో గూడు కట్టుకున్నారని, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో తాను నడుస్తున్నానని చెప్పారు.

జిల్లాలోని జగన్‌ వర్గ నేతలంతా తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా నిలబెట్టడంతోపాటు తనను గెలిపించి జగన్‌కు కానుకగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. తాను 300లకు పైచిలుకు ఓట్లతో గెలవనున్నానని, మిగిలిన ఓట్లు మాత్రమే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు వస్తాయని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, దగదర్తి జడ్పీటిసి సభ్యులు గోగుల వెంకయ్య, జగన్‌ వర్గ నేత కెవి.రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment