Pages

Tuesday, July 19, 2011

మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి!

మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి!
జడ్పీ వర్గాలకు చైర్మన్ వేడుకోలు...!


ఐదేళ్ళు సంతృప్తిగా పని చేశాననే భావిస్తున్నా... కేవలం ప్రభుత్వంపైనే ఆధార పడకుండా వీలైనన్ని మార్గాల్లో వనరులు సమీకరించి జిల్లా అభివృద్ధికి పని చేశా. ఈ పనివత్తిడిలో నా వ్యవహారశైలికి ఎవరి మనసులైనా నొచ్చుకుని ఉంటే మన్నించండి.. అని జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దారిమళ్ళుతున్న ఇసుక ఆదాయాన్ని రాబట్టి జిల్లా అభివృద్ధికి మళ్లించడం తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందన్నారు. ఇందుకు అధికారులు ప్రజాప్రతినిథులు అంతా సహకరించారని ఈ పరిణామాన్ని తాను ఎన్నడూ మరిచిపోలేనని పేర్కొన్నారు. అలాగే అన్ని వర్గాల వారికి అవసరమైన పనులు చేయగలిగానన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ప్రజాప్రతినిథులను అందరినీ పేరుపేరునా గుర్తు చేసుకున్నారు. జడ్పీ చైర్మన్‌గా తన ఐదేళ్ల ప్రస్థానంలో వారు తన చేదోడు వాదోడుగా నిలిచి సంఘటనలను మననం చేసుకున్నారు. జడ్పీని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జనరల్ ఫండ్స్ విషయంలో తలెత్తిన ఆపోహలు తొలగించాల్సి ఉందన్నారు. తమ హయాంలో జరిగిన కృషి వల్ల జడ్పీ జనరల్ నిధుల్లో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు మిగులు ఉన్నాయన్నారు. వీటిని వచ్చే ఏడాది జిల్లా అభివృద్ధికి సక్రమమైన రీతిలో ఖర్చయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా మూడు తీర్మానాలు చేశారు. విడవలూరు మండలంలోని అలగాని పాడు గ్రామంలోని పాఠశాలకు కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య పేరు పెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇందుకు అధికారులు కృషి చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. పాఠశాలకు పేరు పెట్టడానికి పది లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని, అయితే ఆదర్శమూర్తి పేరు పెట్టడానికి అలాంటి లాంఛనాలు లేకుండా పని జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. అలాగే ఐదేళ్ల పాటు పాలకవర్గానికి సహకరించిన అధికారులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానం, ప్రజాప్రతినిథులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అమోదించారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ టివిఎస్ రాజా, సిఇవో జయరామయ్యతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిథులు కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment