రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు పరిపాలనపై దృష్టి పెట్టకుండా ఆయా ప్రాంతాల ప్రత్యేకత కోసం రాష్ట్రాన్ని వదిలి బయట ఉండడంతో పరిపాలన కుంటుపడిందని, తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేడో రేపో కుప్పకూలడం ఖాయమనే సందేహం కలుగుతుందని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జడ్పీ కార్యాలయం ఆవరణంలో జరిగిన జడ్పీ ఛైర్మన్ ఐదేళ్ల పాలనపై అభినందన సభ జడ్పీ వైస్ ఛైర్మన్ టివిఎస్ రాజా అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సభకు సన్మాన గ్రహీత హోదాలో హాజరైన జడ్పీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 46 మండలాల్లోని జడ్పీటిసి సభ్యులు ఐదేళ్లపాటు అందించిన సహాయ సహకారాల వల్లే సుపరిపాలనను అందించగలిగామన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు కూడా తమకు మంచి సహకారం అందించారని, తాను ఎన్నికైనప్పుడు వున్న ఎమ్మెల్యేలు, ప్రస్తుతం వున్న ఎమ్మెల్యేల సహకారానికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తన ఐదేళ్ల పరిపాలనలో నెల్లూరు జిల్లా పరిషత్ రాష్ట్రానికే రోల్‌మోడల్‌గా నిలిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నుండి అధిక సంఖ్యలో నిధులు రాబట్టగలిగిన జిల్లా పరిషత్‌లలో నెల్లూరు ్రపథమ స్థానంలో ఉందన్నారు.
జిల్లాపరిషత్ హైస్కూల్‌లో చదువుకునే ప్రతిభ కలిగిన విద్యార్థులకు తన సొంత నిధులతో ప్రోత్సాహక బహుమతులను గత నాలుగేళ్లుగా అందించానని, ఇప్పుడు కూడా అందించి ప్రోత్సహిస్తామన్నారు. తనకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా తమ శాఖలో పనిచేసే 4వ తరగతి ఉద్యోగుల పిల్లలు అధిక శాతంలో ఉత్తీర్ణత అయితే వారికి ఉన్నత చదువుల కోసం అందించడం జరిగిందన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి నెల్లూరు జడ్పీకి అడిగిందే తడవుగా నిధులను విడుదల చేశారని, ఆయన చలువ వల్లే నేడు జిల్లా పరిషత్‌కు కొత్త భవనాన్ని నిర్మించుకున్నామన్నారు.
గడచిన ఐదేళ్ల కాలంలో ఇసుక రీచ్‌ల ద్వారా జిడ్పీకు రూ.60 కోట్లు ఆదాయాన్ని సమకూర్చామన్నారు. జిల్లాలో విద్య, వైద్య, క్రీడారంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక ప్రజోపయోగ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. జడ్పీ ఛైర్మన్ కప్‌ను ప్రవేశపెట్టి గ్రామీణ క్రీడాకారుల్లో వున్న ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయికి ఎదిగేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు జడ్పీలో తిష్ట వేసి పరిపాలనను తమ చేతుల్లోకి తీసుకునే పద్ధతికి చెక్ పెట్టి స్థానిక సంస్థల అధికారాలు కేవలం జడ్పీటిసిల ద్వారానే జరిగేటట్లు చర్యలు తీసుకున్నామన్నారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ తనకు దివంగత నేత డాక్టర్ వైఎస్‌ఆర్ ఆశీస్సులతో జిల్లా పెట్టిన భిక్ష అని ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. చేతనైతే ప్రజలకు ఉపయోగపడే జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, అంతేకాని అభివృద్ధి నిరోధకాలుగా మారవద్దని పరోక్షంగా ఆనం సోదరులనుద్దేశించి అన్నారు. ఇప్పటివరకు రూ.118 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం కోటి రూపాయలతో ప్రారంభించబడిన జిల్లా పరిషత్ నూతన భవనాన్ని పూర్తి చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రి బొత్సా సత్యనారాయణలను ఎన్నిసార్లు కలిసినా కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా భవన నిర్మాణం ముందుకు సాగేందుకు వీలు లేదని, నిధులు లేవని చెప్పడం ఆవేదన కలిగించిందన్నారు.
దీనివెనుక స్వార్థ రాజకీయ నాయకుల కుట్ర ఉందనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. తన ఊపిరి ఉన్నంతవరకు ప్రజలతో మమేకమై ప్రజోపయోగ కార్యక్రమాలను పదవి ఉన్నా లేకున్నా చేస్తుంటానన్నారు. ఈ సన్మాన సభలో జిల్లాలోని జడ్పీటిసి సభ్యులు, ఎంపిపిలు, ఎంపిటిసిలు పాల్గొని రెండు రోజుల్లో పరిపాలనా కాలం ముగించుకోనున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డిని గజమాలలతో ఘనంగా సన్మానించారు. కాకాణికి సన్మానం సందర్భంగా జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
No comments:
Post a Comment