Pages

Thursday, May 26, 2011

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పగ్గాలు కాకాణికే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అడహాక్ కమిటీ కన్వీనర్‌గా జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు గురువారం సాయంత్రం రాష్ట్ర రాజధానిలో ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడే సమయానికి కాకాణి హైదరాబాద్‌లోనే ఉన్నారు. కాకాణి నియామకంపై జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బాణా సంచ పేల్చి, సంబరాలు జరుపుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో జెడ్పీ చైర్మన్ పదవిని అలంకరించిన కాకాణి గోవర్ధనరెడ్డి నిస్వార్థమైన సేవలందించి, జిల్లా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు.

జెడ్పీ చైర్మన్‌గా ఐదేళ్ల కాలంలో చక్కని పాలనను అందించి, అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందారు. ప్రధానంగా విద్య, వైద్యం, క్రీడలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డారు. స్థానిక సంస్థల బలోపేతం, హక్కుల సాధన కోసం కాకాణి పలు సందర్భాల్లో బలమైన వాణిని వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. సొంత నిధులు వెచ్చించి, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి, సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలిచారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించే నేతగా పేరు పొందారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం, ఆయన కుమారుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెంట నిలిచారు. ఇటీవల జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషించారు.

కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్వస్థలం పొదలకూరు మండలం తోడేరు గ్రామం. ఆయన తండ్రి కాకాణి రమణారెడ్డి పొదలకూరు సమితి అధ్యక్షుడిగా 18 సంవత్సరాలపాటు పనిచేశారు. సివిల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన గోవర్ధనరెడ్డి, తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఈ క్రమంలో 1999లో పీసీసీ సభ్యుడిగా నియమితులయ్యారు. రెండు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగారు. 2006లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో సైదాపురం జెడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే సమయంలోనే జెడ్పీచైర్మన్ పదవి ఆయన్ని వరించింది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియమితులైన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పార్టీనేతలు, కార్యకర్తలు బాణాసంచ పేల్చి, సంబరాలు జరుపుకొని, ఆనందం వ్యక్తం చేశారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: కాకాణి
మహానేత వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా, పెద్దలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నాయకత్వంలో జిల్లాలోని పార్టీ నేతలను, కార్యకర్తలను, అభిమానులను...అందరినీ సమన్వయ పరుచుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, సాధారణ ఎన్నికలు కానీ..ఎప్పుడు వచ్చినా విజయదుంధుబి మోగించడానికి పార్టీని సన్నద్ధం చేస్తాం. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వార్డు స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు పాటుపడతాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా తనను నియమించినట్లు పార్టీ పెద్దలు ప్రకటన చేసిన సమయంలో నేను హైదరాబాదులో ఉన్నాను. ఆదివారం నెల్లూరుకు వస్తున్నా. నాపై ఎంతో నమ్మకం ఉంచి మొట్టమొదటగా జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు.

No comments:

Post a Comment