Pages

Tuesday, February 15, 2011

జడ్పీలో అవినీతి జరగలేదు అఖిలపక్ష సమావేశంలో చైర్మన్ కాకాణి స్పష్టం

జిల్లా పరిషత్‌లో అవినీతి జరిగిన విషయంలో తాను సంతకాలు చేసిన ఫైళ్లలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరుగలేదని జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్‌కు సంబంధించి కేవలం 50లక్షల రూపాయల నిధులు మాత్రమే విడుదలచేసినట్టు ఇటీవల టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారని, అయితే నిజానికి 4 కోట్ల 51లక్షల, 81 వేల రూపాయలు విడుదల చేశామన్నారు. జడ్పీపై వచ్చిన అవినీతి ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గు తేల్చాలనే ఉద్దేశ్యంతో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశామని కాకాణి తెలిపారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న వారికి ఫైల్స్ చూపించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పముజుల దశరథరామయ్య జడ్పీ భవన నిర్మాణం, ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనుల గురించి వివరించాలని కోరారు. ఇందుకు కాకాణి స్పందిస్తూ జడ్పీ భవన నిర్మాణానికి సంబంధించి గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కోటి రూపాయలు మంజూరు చేశారని, అయితే దురదృష్టవశాత్తు నిధులు విడుదల చేయకుండానే ఆయన మరణించారన్నారు. దీంతో జిల్లాలోని ఇసుక రవాణాను అడ్డుకుని 3కోట్ల రూపాయలతో భవన నిర్మాణాన్ని ప్రభుత్వ అనుమతితో చేపట్టామన్నారు. కొందరు తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పోలీసులు, ఎసిబి అధికారులచేత విచారణ జరిపించారన్నారు. శుక్రవారం లోపు జడ్పీ భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లులను ఎందుకు ఆపారో సమాధానం చెప్పాలని న్యాయ స్థానం కోరిందని, హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి పనులు ప్రారంభిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ గ్రామస్థాయిలో గుర్తించిన పనులకు జడ్పీ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత జిల్లా కలెక్టర్ వద్దకు ఫైల్ చేరుస్తామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా ఎంపిడిఓలపై చర్య తీసుకునే అధికారం తనకు లేదని జిల్లా కలెక్టర్ మాత్రమే చర్యలు తీసుకోగలుగుతారని చెప్పారు. జడ్పీ తీర్మానం చేసిన పనులు కూడా ఇన్‌చార్జ్ మంత్రులు చూస్తారని ప్రభుత్వం కొత్తగా నిబంధనలు విధించిందన్నారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరుగుతోందని ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియచేస్తే, రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తుందని, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎంపిడిఓలను బదిలీ చేసే అధికారం మాత్రమే జడ్పీ చైర్మన్‌కు ఉంటుందని చెప్పారు. ఎక్కడా అవినీతికి స్థానం లేకుండా జడ్పీకి సంబంధించి అనేక కార్యక్రమాలు చేశామన్నారు. రెండు సమావేశాల్లో వివాదాలు చోటుచేసుకున్నాయన్నారు. తన స్వంత నియోజకవర్గం సైదాపురంకు ఎక్కువ నిధులు కేటాయించామని కొందరు జడ్పీ సమావేశాల్లో విమర్శిస్తున్నారన్నారు. గతంలో ఇసుక రీచ్‌లకు జడ్పీ చైర్మన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల చైర్మన్‌గా తనతోపాటు కలెక్టర్ ఉండేవారని, అయితే ప్రస్తుతం రీచ్‌లకు జాయింట్ కలెక్టర్, క్రీడా ప్రాధికార సంస్థకు కలెక్టర్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారన్నారు. అవినీతి జరుగకూడదు, అభివృద్ధి జరగాలనే కోరుకునే వారిలో తాను కూడా ఒకడినని కాకాణి తెలిపారు. బిజెపి జిల్లా అధ్యక్షులు కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ కాకాణి జడ్పీ చైర్మన్ అయిన తర్వాత పరిపాలన బాగుందని ప్రశంసించారు. నిజాయితీగా అన్ని ఫైళ్లను సమావేశంలో చూపించడాన్ని ఆయన అభినందించారు. కార్పొరేషన్, విఆర్ కళాశాలలో అనేక అరోపణలు వచ్చాయని, జిల్లా మంత్రి కూడా ఇదేవిధంగా తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జక్కా వెంకయ్య మాట్లాడుతూ చైర్మన్‌పై అవినీతి ఆరోపణలు లేవన్నారు. సోషల్ ఆడిట్‌పై చర్యలు తీసుకునే అధికారం జడ్పీ చైర్మన్‌కు లేదన్నారు. కాకాణి నిజాయితీని జక్కా అభినందించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనుల్లో ఎక్కడ అవినీతి జరిగిందో వాటిపై చర్యలు తీసుకోవచ్చుకదా అని ప్రశ్నించారు. ఇందుకు కాకాణి స్పందిస్తూ తనకు ఎంపిడిఓలపై చర్యలు తీసుకునే అధికారం లేదన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనుల్లో అవినీతి జరిగిందని గత రెండేళ్లుగా పోరాడుతున్నామని, కానీ ఇందుకు ఎవరూ స్పందించలేదని, అంతర్గత రాజకీయాల వల్లే అవినీతి బయటకు వచ్చిందన్నారు. సమావేశంలో నెల్లూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు నర్రా శ్రీ్ధర్, జడ్పీటిసిలు నారపరెడ్డి, వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment