జిల్లాలో సహజ సంపద యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నా దాన్ని అరికట్టడంలో అధికారులు విఫలం చెందారని జిల్లా పరిషత్ చైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక రవాణాలో జరిగిన అక్రమాలను సాక్ష్యాధారాలతో నివేదికను ఆయన మీడియాకు అందజేశారు. దశాబ్దాలుగా జిల్లాలో కొందరు పెద్దలు ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారన్నారు. అధికారుల ఉదాశీనత వైఖరి వల్లనే స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడిందన్నారు. పదేళ్లలో రూ. 100 కోట్ల ఆదాయాన్ని స్థానిక సంస్థలు కోల్పోయాయన్నారు.ఈ ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయడంలో మైనింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగమవుతుంటే ఏసీబీ అధికారుల ఏం చేస్తున్నారని కాకాణి ప్రశ్నించారు.
జెడ్పీ నూతన కార్యాలయంపై చూపిన శ్రద్ధను ఇసుక రవాణాపై ఏసీబీ ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఏసీబీ తన ఉనికినే కోల్పోయిందని ఘాటుగా విమర్శించారు. భూగర్భ జలాలకు నష్టం కలిగించే వారిపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో ఇసుక దోపిడీని అరికట్టినందు వల్లే జెడ్పీకి రూ.50 కోట్లు ఆదా యాన్ని రాబట్టినట్లు చెప్పారు.
జిల్లాలోని ముదివర్తిపాళెం,పోతిరెడ్డిపాళెం, పల్లిపాడు, జొన్నవాడ, మినగల్లు ప్రాంతాల్లో టెండర్లు పిలవాల్సి ఉందని, ఈ ప్రక్రియ పూర్తయితే మరో రూ. 10 కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికడితే ఏటా జెడ్పీకి రూ. 30 కోట్లకు పైగా ఆదాయం వస్తుందన్నారు. అయితే గడచిన ఎనిమిదేళ్లలో జెడ్పీకి రూ.13 కోట్లు మాత్రమే జమ కావడం బాధాకరమన్నారు. వేలం పాటల కమిటీలో జెడ్పీ సీఈఓను సభ్యునిగా చేర్చకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. పాలకులు పరిపాలనపై శ్రద్ధ చూపాలే తప్ప అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదన్నారు. అధికారులపై ఒత్తిడి తేవడంతో విధులు సక్రమంగా నిర్వహించలేక పోతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని సమీక్షించి ,పూర్తి స్థాయిలో విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డ వారిపై తగు చర్యలు తీసుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు.
జెడ్పీ భవనాన్ని సకాలంలో పూర్తి చేస్తాం: జెడ్పీ నూతన భవనాన్ని సకాలంలో పూర్తి చేయిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులకు ఇబ్బంది కలిగే పరిస్థితి తలెత్తితే భవన నిర్మాణ పనులను నిలిపి వేస్తామన్నారు. రాజకీయంగా తలెత్తే ఇబ్బందులను తాను ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో ఉన్నందు వ ల్ల పనులు నిలిపేశామని కోర్టు తీర్పు వెలువడిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ వైఎస్ చైర్మన్ టీవీఎస్ రాజా,జెడ్పీటీసీ సభ్యులు వీరి చలపతి, చిరంజీవి రెడ్డి, జి.వెంకయ్య,జయచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment